Sri Lanka: 2022లో తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో పతనావస్థకు చేరుకున్న ద్వీపదేశం శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. విదేశీ మారక నిల్వలు అయిపోయి.. నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో కొన్ని నెలల పాటు శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజపక్స కుటుంబాన్ని దేశం నుంచి తరిమేలా చేసిన శ్రీలంకవాసులు.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని శ్రీలంక నెమ్మదిగా ఆ సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు రావడంతో తీవ్ర ప్రాధాన్యం నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు.. శ్రీలంకను ఎలా బయటికి తీసుకువస్తారు, మళ్లీ శ్రీలంకకు పునర్వైభవాన్ని ఎలా తెస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే సవాళ్ల నుంచి బయటికి వస్తున్న శ్రీలంక ప్రజలు.. తమకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 1.7 కోట్ల మంది శ్రీలంకవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు దివాలా తీసిన దశలో ఉన్న శ్రీలంకను మెల్లగా గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. మరోసారి పోటీ చేస్తుండగా.. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పోటీలో నిలిచారు. ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 38 మంది పోటీ పడుతున్నారు.
అయితే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్ష పీఠానికి త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతోపాటు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నేత అనుర కుమార దిస్సనాయకే.. సామగి జన బలవేగాయ పార్టీ నేత సాజిత్ ప్రేమదాస ప్రధానంగా పోటీలో ఉండటంతో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక శ్రీలంక పతనానికి కారణమని ఆ దేశ ప్రజలు భావించే రాజపక్స కుటుంబం నుంచి నమల్ రాజపక్స కూడా అధ్యక్ష పోటీలో నిలిచారు. మహింద రాజపక్స కుమారుడైన నమల్ రాజపక్స.. మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స స్థాపించిన ఎస్‌ఎల్‌పీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే నమల్ రాజపక్సకు ఆదరణ కరవైంది.