గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా.. నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా.. కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం మెుత్తం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. చెరువులో అక్రమంగా నిర్మించిన 16 షెడ్లు, నిర్మాణ దశలో ఉన్న రెండు అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేస్తున్నారు. కాగా, గత 15 రోజుల క్రితం మాదాపూర్ దుర్గం చెరువు వద్ద అక్రమ నిర్మాణాల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
హైడ్రాకు చట్టబద్ధత.. హైడ్రాకు విస్తృత అధికారాలను,చట్టబద్దత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను కల్పించేలా నియమ నిబంధనలను సడలిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రాకు పూర్తి అధికారాలు కల్పించింది. హైడ్రా కూల్చవేతలకు 150 మంది అధికారులు సహా 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించేందుకు సిద్ధమయ్యారు.