కేతిరెడ్డీ.. నీ కోరిక తీరుస్తాం.. మంత్రి సత్యకుమార్ వార్నింగ్

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం ఉద్రిక్తత తలెత్తింది. ధర్మవరం సబ్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ లీడర్ హరీష్ వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. సబ్ జైలులో రిమాండ్‌‍లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు.. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ విషయం తెలిసి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో సబ్ జైలు వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి.

అయితే ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాహనాన్ని కూటమి నేతలు చుట్టుముట్టారు. కేతిరెడ్డి వాహనం డ్రైవర్ మీద కూడా దాడిచేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఓ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే కారు బానెట్ పైకి కూడా ఎక్కారు. దీంతో తప్పించుకునే క్రమంలో కేతిరెడ్డి కారు డ్రైవర్.. అలాగే కారును ముందుకు పోనిచ్చారు. దీంతో ఆ కార్యకర్త రోడ్డుపై పడిపోయారు. అయితే తాము వస్తున్న సమయంలో కేతిరెడ్డి వర్గీయులు తమ కార్లను అడ్డుగా పెట్టారని బీజేపీ నేత హరీష్ వర్గం ఆరోపిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్ జైలు లోపల ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ఘటన మీద ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. కేతిరెడ్డి నిజస్వరూపం ఇదంటూ వీడియో షేర్ చేశారు. ప్రజల పైకి వాహనాన్ని ఎక్కించారంటూ ట్వీట్ చేశారు. ” ఇదీ ధర్మవరం కేటురెడ్డి నిజస్వరూపం. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం. గతంలో చేసిన తప్పులకు, కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తాం. కానీ ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించం. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.” అంటూ మంత్రి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మవరం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీచేసిన సత్యకుమార్.. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *