ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సామాన్యుడు చేసిన ట్వీట్‌కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.. అయితే మంత్రి కాన్వాయ్‌లోని వాహనం రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని భరద్వాజ్ ఎక్స్ ( ట్విట్టర్)లో లోకేష్‌కు చెప్పారు.
‘లోకేష్ గారూ.. నాకు మీ పరిపాలన, టీడీపీ అంటే ఇష్టం. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీససుకొచ్చినందుకు గర్వంగా ఉంది. అయితే ఇవాళ విశాఖపట్నంలో తాటిచెట్లపాలెం హైవే దగ్గర మీ కాన్వాయ్ వెళ్లేందుకు మా కారును రోడ్డుపక్కన ఆపారు. అయితే మీ కాన్వాయ్‌లోని ఓ వాహనం రా కారును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది’అంటూ ట్వీట్ చేశారు. తన కారుకు డ్యామేజ్ అయిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
ఈ ట్వీట్ గమనించిన వెంటనే లోకేష్ స్పందించారు. ‘మీకు నా క్షమాపణలు. నేను నా భద్రతా సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెబుతాను. నా టీమ్ మిమ్మల్ని కలుస్తుంది.. మీ కారుకు అయిన డ్యామేజ్ రిపేర్ చేయించేందుకు అయ్యే ఖర్చును భరిస్తారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకష్ క్షమాణపలు చెప్పడంపై కళ్యాణ్ భరద్వాజ్ స్పందించారు.. ‘మీ దాతృత్వానికి చాలా ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యుడికి కలిగిన నష్టం గురించి తెలిసి స్పందించిన తీరు బావుందంటున్నారు.