ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది.మరీ ముఖ్యంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. ఏపీలో నూతన విమానాశ్రయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలను విమానాశ్రయాలతో అనుసంధానం చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ పెంచుతామని చెప్పారు.
మరోవైపు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని లోకేష్ చెప్పుకొచ్చారు. పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు. అన్ని జిల్లాలలోనూ పెట్టుబడులకు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానం తెచ్చా్మన్న నారా లోకేష్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నం నుంచి 15 రోజుల్లో కార్గో సర్వీస్ ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నాలుగు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.