2BHK Apartment Rents: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడితే ముందుగా ముంబై గురించి మాట్లాడుతుంటారు. అక్కడ బహుళ అంతస్తుల భవనాలే దర్శనం ఇస్తుంటాయని చెప్పొచ్చు. ఇక ఇళ్ల లేదా ఫ్లాట్స్ అమ్మకాలు అక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ధరలు కూడా భారీగానే పలుకుతుంటాయి. ముంబై తర్వాత ఢిల్లీ- NCR, బెంగలూరు, పుణె, చెన్నై ఇలా మాట్లాడుకుంటుంటారు. అయితే కొంత కాలంగా ఈ పరిస్థితి మారిపోయింది. బెంగళూరులో మార్కెట్ క్షీణిస్తూ వస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అమాంతం పుంజుకొని దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకే పోటీని ఇస్తుండటం విశేషం. ఒకానొక దశలో కొన్ని త్రైమాసికాల్లో పలు రిపోర్టుల్ని బట్టి చూస్తే.. హైదరాబాద్ మార్కెట్.. ముంబైని కూడా దాటేసింది. ఆ మధ్య ఎకరం భూమి కోకాపేటలో రూ. 100 కోట్లకుపైగా పలికింది కూడా. ఇక అద్దెల గురించి చెప్పనక్కర్లేదు.
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అద్దెకు ఉండాలంటే దొరకని పరిస్థితి. మనకు అందుబాటులో అద్దె గదులు ఉన్నప్పటికీ.. అక్కడ రెంట్ కట్టే స్థోమత సామాన్య ప్రజలకు ఉండదు. పలు చిన్న చిన్న ఏరియాల్లోనే సింగిల్ రూం దాదాపు రూ. 8 వేలు, సింగిల్ బెడ్ రూం రూ. 15 వేలకుపైగా పలుకుతోంది. ఇక గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి చోట్ల చెప్పనక్కర్లేదు. ఇంకా భారీగా ఉంటుంది.
కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది హైదరాబాద్ నగరంలో కాదు. ముంబైలో ఇప్పుడు ఒక డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ ఒకటి అద్దెకు ఖాళీగా ఉందని ప్రకటన ఇచ్చారు. ఇది బాంద్రా వెస్ట్ రన్వార్‌లోని పాలి హిల్‌లో ఉండగా.. అందులో చూస్తే అద్దె ప్రతి నెలా ఏకంగా రూ .1.35 లక్షలు చెల్లించాలని ఉంది. అసలు జీతం అయినా అంత ఉండాలిగా దాంట్లో ఉండేందుకు. ఇంకా అడ్వాన్స్ కింద రూ. 4 లక్షలు చెల్లించాలని అందులో షరతు ఉంది. ఆ ప్రకటనలో చూస్తే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఏర్పాటు చేయడం గమనార్హం.