Anil Ambani’s Reliance Shares: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. దిగ్గజ కంపెనీ స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ.. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG) షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల అప్పుల్ని తీర్చేయడం సహా నిధుల సమీకరణ వంటి ఇతర ప్రణాళికల నేపథ్యంలో.. గ్రూప్ స్టాక్స్ అన్నీ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. రిలయన్స్ పవర్ స్టాక్ ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ కొట్టి.. 8 రోజుల్లో 50 శాతం వరకు పెరిగింది. ఇదే 12 రోజుల్లో 60 శాతానికిపైగా ఎగబాకింది. ఇతర రిలయన్స్ గ్రూప్‌లోని.. రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి స్టాక్స్ కూడా అప్పర్ సర్క్యూట్లు కొడుతూ కస్టమర్లకు లాభాల్ని అందించాయి. దీంతో కనిష్ట స్థాయిల నుంచి ఆయా షేర్లు మళ్లీ జీవన కాల గరిష్టాల దిశగా పరుగులు పెట్టాయి.
అయితే.. ఇప్పుడు ఈ రిలయన్స్ గ్రూప్ షేర్లు పతనం అవుతున్నాయి. గత వారంలో ఈ అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హై వాల్యూ తాకగా.. గరిష్టాల వద్ద లాభాల్ని సొమ్ము చేసుకునే దిశగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడుతున్నారు. మరోవైపు.. రిలయన్స్ పవర్ ఇవాళ బోర్డు సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ముఖ్యంగా కంపెనీ లాంగ్ టర్మ్ వనరుల్ని సమకూర్చుకునే దిశగా ప్రకటనలు చేయనుంది. ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ లింక్డ్ షేర్లు, సెక్యూరిటీలు లేదా వారెంట్లు జారీ చేయడం ద్వారా నిధుల్ని సమీకరించాలని చూస్తోంది. మరోవైపు ప్రిఫరెన్షియల్ ఇష్యూ కూడా ప్లానింగ్‌లో ఉంది. దాదాపు రూ. 1500 కోట్ల విలువకుపైగా ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఉంటుందని సమాచారం.
కిందటి సెషన్లో రూ. 46.35 వద్ద జీవన కాల గరిష్టం నమోదు చేసింది రిలయన్స్ పవర్ కంపెనీ. ఇది ఒకప్పుడు 99 శాతం వరకు పడిపోగా.. మళ్లీ పడిలేచిన కెరటంలా ఎగసింది. గత 8 సెషన్లుగా అప్పర్ సర్క్యూట్స్ కొట్టిన ఈ షేరు ఇవాళ 5 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. ఇంట్రాడేలో 44.21 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఇది 4 శాతం పతనంతో రూ. 44.55 లెవెల్స్‌లో ఉంది. మార్కెట్ విలువ రూ. 11.96 వేల కోట్లుగా ఉంది.
మరోవైపు రిలయన్స్ హోం ఫైనాన్స్ స్టాక్ కూడా వరుస అప్పర్ సర్క్యూట్స్ నుంచి ఒక్కసారిగా దిగొచ్చింది. ఇవాళ 5 శాతానికిపైగా లోయర్ సర్క్యూట్‌తో రూ. 5.28 వద్ద స్థిరపడింది. కిందటి సెషన్లో రూ. 5.56 వద్ద ముగియగా ఇవాళ ఆరంభంలో రూ. 5.83 వద్ద ఇంట్రాడే గరిష్టం అదే విధంగా ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ. 174 కోట్లుగా ఉంది. ఇక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టాక్ దాదాపు 2 శాతం పెరిగి రూ. 328.98 వద్ద ఉంది. ఇంట్రాడేలో దాదాపు 4 శాతం లాభంతో రూ. 334 వద్ద గరిష్టాన్ని తాకింది.
 Amaravati News Navyandhra First Digital News Portal
Amaravati News Navyandhra First Digital News Portal
				 
		