విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అందజేశారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు.
అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు ఆభరణాలు అందజేశారు. వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను కానుకగా ఇచ్చారు. దసరా సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలిరోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మరోవైపు నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. అమ్మవారికి దేశ నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వీరికి దర్శనాలు ఉంటాయి.. వీరు ఆ సమయంలోనే రావాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
విజయవాడకు విచ్చేసే భక్తులకు విక్రయించేందుకు 25 లక్షల లడ్డూలను ముందగానే సిద్ధం చేస్తున్నారు. లడ్డూలు విక్రయించేందుకు 18కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో కొండ దిగువన కనకదుర్గానగర్‌లో 10.. మిగతావి బస్టాండ్, రైల్వేస్టేషన్, స్టేట్ గెస్ట్‌హౌస్, ఘాట్లు వంటిచోట్ల ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు కొండపై ఆలయంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకూ భక్తులకు ఉచిత ప్రసాదం అందిస్తారు. భక్తులకు పులిహోర, కట్టె పొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం వితరణ ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొండ దిగువన ఏర్పాటు చేసిన శిబిరంలో అమ్మవారి అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
దసరా ఉత్సవాలతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దుర్గగుడి, ఘాట్లు, విజయవాడ సహా చుట్టుపక్కల మూడు షిఫ్టుల్లో 5,200 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో ఉన్న 200 సీసీ కెమెరాలతో ఉత్సవాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అలాగే మరికొన్నికెమెరాలను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్, పోలీసు కమిషనర్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్‌్ రూమ్‌ల వద్ద మానిటర్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షణ ఉంటుంది.