ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నీతిఆయోగ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడంపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వీజీఎఫ్‌పై నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తో మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో సమావేశమై చర్చించారు. ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని.. ఇందులో నిర్వహణ వ్యయం రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్ దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. 12 మెడికల్ కాలేజీలకు రెండు, మూడు దశల్లో వీజీఎఫ్ ఇచ్చేందుకు నీతి ఆయోగ్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మిస్తోన్న 12 మెడికల్ కాలేజీలకు ఎంతమేర వీజీఎఫ్ ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.
రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీలు నాబార్డు నిధులతో నిర్మిస్తున్నారు.. వీటికి రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కొన్ని కాలేజీలకు వైద్య విద్యా కోర్సులు ప్రారంభమయ్యేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో రెండు మూడు దశల్లో వీజీఎఫ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదలను పరిశీలిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని అభివృద్ధికి అవసరమయ్యే సాయంపై కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తో చర్చించారు. ప్రమాద, ట్రామాకేర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని.. అందుకే ఈ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 15 యాస్పిరేషన్ బ్లాకుల్లో వివిధ రంగాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయా బ్లాకుల్లో వైద్య సేవల అభివృద్ధికి కేంద్రసాయంపై కూడా మంత్రి నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తో చర్చించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరికొన్ని అదనపు బ్లాకులను యాస్పిరేషన్ బ్లాకులుగా గుర్తించాలని కోరారు. అంతేకాదు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అమలవుతున్న సాగునీటి పథకాల అమలుతో జల్ జీవన్ మిషన్‌ను అనుసంధానం చేయాలని మంత్రి సత్యకుమార్ విన్నవించారు. ఈ అంశాలపైనా సానుకూల స్పందన వచ్చింది.