గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందన్నారు. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని అన్నారు.
ఆ అల్పపీడనం ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. అనంతరం తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చనిని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చునని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది వాయవ్య దిశగా కదులుతుందని.. మరో రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇక నేడు తెలంగాణకు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.