మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక చిరంజీవిని అప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించిన చంద్రబాబు.. యోగక్షేమాలు అడిగారు.
అనంతరం వరద బాధితులకు అండగా నిలబడినందుకు మెగాస్టార్ చిరంజీవిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ఎల్లప్పుడూ ఇలా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం స్వయంగా కారు వరకూ వచ్చి.. చిరంజీవికి చంద్రబాబు నాయుడు వీడ్కోలు పలికారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలను ఆగస్ట్, సెప్టెంబర్ నెలల సమయంలో వరదలు అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వాసులకు వరదలు నరకం చూపించాయి. చాలా మంది సర్వస్వం కోల్పోయారు. ఇక వీరిని ఆదుకునేందుకు రంగాలకు అతీతంగా ప్రముఖులు ముందుకు వచ్చారు. వ్యాపారవేత్తల నుంచి విద్యావేత్తల వరకూ.. సినీ సెలబ్రిటీలు కూడా తమ వంతు అండగా నిలిచారు.
ఇదే క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఇంతే మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కలిపి చిరంజీవి.. సీఎం చంద్రబాబు నాయుడు చేతికి అందజేశారు. ఇక ఏపీలోని వరద బాధితుల కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పెద్దహీరోలతో పాటుగా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల వంటి తారలు కూడా తమ వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన విరాళాల ద్వారా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు పరిహారం కూడా విడుదల చేసింది.