పండగ వేళ ఐటీ దిగ్గజం కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల జారీ.. అదే రోజున ఫలితాలు!

Wipro Q2 Results: ఇన్వెస్టర్లకు అలర్ట్. ఐటీ దిగ్గజ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించనుంది. భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన విప్రో లిమిటెడ్.. అక్టోబర్ 17న బోర్డు సమావేశం నిర్వహించి.. ఆర్థిక ఫలితాలకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. ఈ క్రమంలోనే బోనస్ షేర్లు జారీ చేయనుంది. త్రైమాసిక ఫలితాల్ని చర్చించి.. ఆమోదించడంతో పాటుగానే.. బోనస్ షేర్ల ప్రతిపాదనపై కూడా బోర్డ్ డైరెక్టర్స్ ఈ నెల 17న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు.. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ విషయం గురించి ఆదివారం రోజు సమాచారం ఇచ్చింది విప్రో. కంపెనీస్ యాక్ట్- 2013 నిబంధనలకు అనుగుణంగా.. ఈ బోనస్ షేర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది.

విప్రోకు బోనస్ షేర్ల జారీకి సంబంధించి మంచి చరిత్రే ఉందని చెప్పొచ్చు. 1987 నుంచి మొదలుకొని.. 2019 వరకు విప్రో సంస్థ ఏకంగా 10 సార్లు బోనస్ షేర్లు జారీ చేసింది. చివరిసారిగా 2019లో సంస్థ బోనస్ ఇష్యూ ప్రకటించింది. అప్పుడు 1:3 నిష్పత్తిలో అంటే.. ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి 3 ఈక్విటీ షేర్లపై ఒక్కో షేరు అదనంగా వచ్చి చేరిందన్నమాట.

ఇక బోనస్ షేర్లకు కంపెనీ ఒక రికార్డ్ తేదీని నిర్ణయిస్తుంది. ఆలోపు.. ఇన్వెస్టర్లు విప్రో షేర్లను కలిగి ఉన్నట్లయితే వారు బోనస్ షేర్లకు అర్హులు అవుతారని చెప్పొచ్చు. సాధారణంగా బోనస్ షేర్లను జారీ చేసినప్పుడు స్టాక్ ధర తగ్గుతుందన్న సంగతి తెలిసిందే. షేర్ల సంఖ్యను బట్టి.. ధర అడ్జస్ట్ అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు సరసమైన ధరలోనే షేరు అందుబాటులో ఉంటుంది. దీని వల్ల మళ్లీ ఇన్వెస్టర్లు దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంకా స్టాక్ లిక్విడిటీ పెరుగుతుంది. ఈ కారణంతోనే.. బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్‌కు కంపెనీలు మొగ్గుచూపుతుంటాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి గానూ విప్రో నికర లాభం 3003.2 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 4.6 శాతం ఎక్కువే. ఆదాయం స్వల్పంగా తగ్గినప్పటికీ మార్కెట్ అంచనాల్ని మాత్రం మించింది. గత కొన్ని త్రైమాసికాల్లో చూస్తే ఇది ఉత్తమ ప్రదర్శనే అని చెప్పొచ్చు. ఇటీవల మళ్లీ ఐటీకి డిమాండ్ పెరిగిన క్రమంలో ఈసారి కూడా విప్రోకు మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నారు. కొద్ది రోజుల టీసీఎస్ క్యూ2 ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ. 528.45 వద్ద ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 579.90 కాగా.. కనిష్ట ధర రూ. 375.05 గా ఉంది. మార్కెట్ విలువ రూ. 2.76 లక్షల కోట్లుగా ఉంది. గత నెల రోజుల్లో మాత్రం ఈ షేరు ప్రతికూల ఫలితాలు ఇచ్చింది.

About amaravatinews

Check Also

5 నెలల వ్యాలిడిటీ, 320GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌!

ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *