హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే నగరం రూపరేఖలు మారిపోయాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మిచంగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోనే అతిపెద్ద అండర్‌పాస్‌ను నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్నారు. పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు సాగేలా ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ –45 వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ అండర్‌పాస్ నిర్మించనున్నారు.
ఈ అండర్‌పాస్ నిర్మాణంతో ఐటీ కారిడార్, ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ జూబ్లీ చెక్‌పోస్ట్ కంటే ముందు ఉండే అండర్‌పాస్ నుంచి ఎటువంటి సిగ్నల్ చిక్కులు లేకుండా వెహికల్స్ రాకపోకలు సాగించే వీలు కలగనుంది. మెుత్తం మూడు లేన్లుగా ఈ అండర్‌పాస్ నిర్మాణానికి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న అండర్‌పాసులు 200-300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. కేబీఆర్ పార్కు వద్ద 740 మీటర్ల మేర నిర్మిస్తుండగా.. నగరంలో ఇదే అతిపెద్దది కానుంది. ఇక కేబీఆర్ పార్కు చుట్టూ మెుత్తం 7 అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా అందులో మెజార్టీ 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు నిర్మిస్తున్నారు.
కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, ఓ ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ నుంచి వచ్చే వెహికల్స్ మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్ వైపు డైవర్ట్ కానున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్ నుంచి వచ్చే వెహికల్స్ ఫ్రీ లెఫ్ట్ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్ అండర్‌పాస్ వినియోగించాల్సి ఉంటుంది. జూబ్లీచెక్‌పోస్ట్ వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఓ అండర్‌పాస్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.229 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.