ఏపీ మద్యం షాపుల లాటరీలో తెలంగాణ మహిళలకు లక్.. ఎన్ని వచ్చాయంటే!

Andhra Pradesh Liquor Shop Lottery Women Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభంకాగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించగా.. 3,396 మద్యం షాపులకు గాను 345 మహిళలకే దక్కాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 10.20 శాతం షాపులు మహిళలకే లభించాయి. వీటిలో కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున మహిళలకే దక్కడం విశేషం.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, అన్నమయ్య సహా అన్ని జిల్లాల్లో లాటరీ ప్రక్రియలో మహిళలు కూడా పాల్గొన్నారు. కొంతమంది పిల్లాపాపల్ని వెంటపెట్టుకుని మరీ రావాల్సి వచ్చింది. కొంతమంది మద్యం వ్యాపారులు అదృష్టం వరిస్తుందనే ఉద్దేశంతో వారి భార్య, తల్లి పేర్లుతో దరఖాస్తులు చేయించారు. దీంతో వారంతా లాటరీ ప్రక్రియకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో 32 షాపులు ఉంటే ఆరు మహిళలకే దక్కడం విశేషం.

రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి 96వ నంబరు షాపునకు 132, 97వ నంబరు షాపునకు 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు షాపునకు 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మూడు షాపుల లైసెన్సులు లాటరీలో తెలంగాణవారికే దక్కాయి. 96వ నంబరు షాపు ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కింది. 97వ నంబరు షాపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ నంబరు షాపు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు దక్కాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు 121వ నంబరు షాపునకు 108 దరఖాస్తులు రాగా.. విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడు మండలానికి చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకున్నారు. అయితే ఈ షాపుల్ని దక్కించుకున్నవారికి తెలంగాణలో మద్యం వ్యాపారాలు ఉండటం విశేషం.

దేశంలోని ఏ రాష్ట్రం వారైనా మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా దరఖాస్తులు అందాయి. కొందరికి లాటరీలో షాపులు దక్కాయి.. విజయవాడలోని 14, 18వ నంబరు షాపులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ శివ్‌హరే, అర్పిత్‌ శివ్‌హరేకు వచ్చాయి. మచిలీపట్నంలో ఓ షాపు కర్ణాటకకు చెందిన మహేష్‌ బాతే.. మరో షాపు ఢిల్లీకి చెంది లోకేష్ చంద్‌ దక్కించుకున్నారు. ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి షాపులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు కర్ణాటక, తెలంగాణలకు చెందిన వ్యాపారులు దక్కించుకున్నారు. అంతేకాదు కొంతమంది ఎన్ఆర్‌ఐల పేరిట, వారి బంధువులు, కుటుంబీకుల పేరిట దరఖాస్తులు చేయగా వారికి షాపులు దక్కాయి.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *