Vikarabad Navy Radar Station: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే.. ఈరోజు (అక్టోబర్ 15న) నేవీ రాడార్ స్టేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేసేశారు. అయితే.. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఈ నేవీ రాడార్ స్టేషన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. నిజంగానే అడవికి ముప్పు ఉందా.. మూసీకి ముచ్చటేంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజానికి.. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతం అనువైన ప్రాంతంగా భావిస్తారు. కానీ.. ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మించాలని నేవీ ప్రతిపాదించింది. ఈ స్టేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్‌జిల్లా పూడుర్ మండలంలోని దామగుండం ఫారెస్ట్ ఏరియాలోని 2901 ఎకరాలను నేవీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను నేవీ ఏర్పాటు చేస్తోంది. ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు. అలాగే.. రక్షణ రంగంతో పాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు.
అయితే.. దామగుండం ఫారెస్ట్ పూర్తి విస్తీర్ణం 3,261 ఎకరాలు కాగా.. ఈ అడవిని ఆనుకుని దాదాపు 20 పల్లెలు, తండాలు ఉన్నాయి. పశువుల మేతకు, ఇతరత్రా అవసరాలకు ఆయా గ్రామల ప్రజలంతా ఈ అడవి ప్రాంతం మీదే ఆధారపడతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు వంకలు కూడా ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉండే అటవీ కప్రాంతంలో జీవవైవిధ్యం ళ్లకు కట్టినట్టుంటుంది. ఇలాంటి ప్రాంతంలో వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండటం ఇప్పుడు అందరి మనసుల్లో అలజడి సృష్టిస్తోంది.