ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గత కొంతకాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నాయని.. అలాగే మన దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ఇక హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తేనే తాను పోటీచేస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ ఎన్నికల్లో తాను పోటీచేయబోనంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు అయితే.. పోటీచేసినా ఫలితం ఉండదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 2024లో జరిగినట్లుగానే 2029లోనూ జరిగే అవకాశం ఉందన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. బ్యాలెట్ పేపర్ ద్వారానే ప్రజల తీర్పు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అక్రమాలు చేశాయని ఆరోపించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే పోటీచేసేది లేదని ప్రకటించారు.