టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సుమారు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అయితే అతడు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు ఆస్ట్రేలియా పర్యటనకూ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మాట్లాడిన రోహిత్ శర్మ.. మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే మహమ్మద్ షమీ విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో సిరీస్ నాటికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నది చెప్పలేం. మహమ్మద్ షమీకి మోకాలిలో వాపు వచ్చింది. సాధారణంగా ఇలా ఎవరికీ జరగదు. దీంతో అతడు కోలుకునేందుకు కాస్త ఆలస్యమవుతోంది. జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యులు.. ఫిజియోలు అతడి కోసం పనిచేస్తున్నారు” అని రోహిత్ శర్మ చెప్పాడు.
మ్యాచ్ ఫిట్‌నెస్ లేకుంటే కష్టం..
“ఆస్ట్రేలియా పర్యటన నాటికి మహమ్మద్ షమీ వంద శాతం ఫిట్‌నెస్ సాధించాలని మేం కోరుకుంటున్నాం. ఒకవేళ పూర్తిస్థాయిలో కోలుకోకపోతే మాత్రం అతడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని అనుకోవడం లేదు. అది ఏమాత్రం మంచిది కాదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ముందు అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఆడతాడు” అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
Amaravati News Navyandhra First Digital News Portal