ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు, వివరాలివే

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల్ని నియమించడానికి సుప్రీం కోర్టు కొలీజియం పేర్లను సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌ల పేర్లతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, హైకోర్టులోని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించారు. అయితే ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే 15న పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.

కుంచం మహేశ్వరరావుది తిరుపతి. తల్లిదండ్రులు కుంచం సుశీలమ్మ, కోటేశ్వరరావు.. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తిరుపతిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1998లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోగా.. అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత హైకోర్టుకు వచ్చారు.. సీనియర్‌ లాయర్ వేదుల శ్రీనివాస్‌ దగ్గర కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. అనంతరం సొంతగా ప్రాక్టీసు చేసి.. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులలో అనుభవం సాధించారు. హైకోర్టు ప్యానల్‌ లాయర్‌గా, భారత బార్‌ కౌన్సిల్, ఎఫ్‌సీఐ, పలు బీమా సంస్థలకు లాయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

చంద్ర ధనశేఖర్‌ది తిరుపతి జిల్లా సత్యవేడు. తల్లిదండ్రులు తూట శైలజ, చంద్రశేఖరన్‌. చంద్ర నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1999లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోగా.. మాజీ ఏజీ పి వేణుగోపాల్‌ దగ్గర లాయర్‌గా వృత్తిని ప్రారంభించారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేయగా.. ట్యాక్స్, రెవెన్యూ, భూసేకరణ, సివిల్, క్రిమినల్‌ చట్టాలపై అనుభవం ఉంది.

చల్లా గుణరంజన్‌ది అనంతపురం జిల్లా తాడిపత్రి. తల్లిదండ్రులు చల్లా చంద్రమ్మ, నారాయణ.. తండ్రి నారాయణ న్యాయవాది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ గుణరంజన్‌కు సోదరుడు అవుతారు. గుణరంజన్ 2001 మార్చి 21న బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని.. సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రైబ్యునళ్లులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. సివిల్, క్రిమినల్‌ చట్టాలతోపాటుగా ట్యాక్స్, కంపెనీ లా, దివాలా, విద్యుత్‌ సంబంధ, పర్యావరణ వంటి చట్టాలపై అపార అనుభవం ఉంది. అలాగే ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేశారు. తాజాగా సుప్రీం కోర్టు కొలిజీయం కొత్తగా ముగ్గురు న్యాయమూర్తుల్ని సిఫార్సు చేసింది. ఈ ముగ్గురికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుతుంది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీలకు ఆమోదం ఉంది.

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *