ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలు అనేంత దారుణమైన పాలనను చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. రెడ్‌బుక్ పాలన నడుస్తోందన్నారు. సూపర్-6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓటాన్ అకౌంట్‌తో నడిపిస్తున్నారని.. చంద్రబాబు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నువ్వు మళ్లీ అబద్ధమాడి ఉంటే బాగుండేదేమో జగన్ అని నన్ను ఎవరైనా అడిగితే.. లేదు, ప్రతిపక్షంలో కూర్చునేందుకైనా నేను వెనుకాడను. కానీ, అబద్ధం మాత్రం ఆడలేను అనే మాటే నా నోట్లోంచి వస్తుంది’ అంటూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మాట బహుశా చాలామందికి నచ్చకపోవచ్చని.. కానీ విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అనేది ఉండాలన్నారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని.. ప్రతిపక్షంలో ఉంటాం, మళ్లీ అధికారంలోకొస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలి అంటే.. విలువలు విశ్వసనీయతే అక్కడికి తీసుకువస్తాయన్నారు.