ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఇటీవలే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వానలు పడ్డాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జనం ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇది మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాయుగుండం ముప్పు భయపెడుతోంది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. రెండురోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ అల్పపీడనం అక్టోబర్ 22 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అక్టోబర్ 23వ తేదీ నాటికి ఈ వాయుగుండం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం ఒడిశా- పశ్చిమబెంగాల్ మధ్యన తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25వ తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని సూచించింది.
Check Also
ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని …