CNG Price: ప్రస్తుతం పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. దీంతో చాలా మంది సీఎన్‌జీ గ్యాస్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు వారికి సైతం ధరల షాక్ తగలనుంది. దేశీయంగా వెలికి తీస్తున్న సహజ వాయువు (సీఎన్‌జీ) సరఫరా తగ్గిపోతోంది. దీంతో గిరాకీని అందుకునేందుకు విక్రయ సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిటైల్ విక్రయ సంస్థలు చెబుతన్నాయి.
విదేశాల్లో కొనుగోలు చేస్తున్న సీఎన్‌జీ ధరలు ఎక్కువగా ఉన్నందున దేశీయంగా వాహనాలకు విక్రయింతే సీఎన్‌జీ గ్యాస్ ధర కిలోపై రూ.4 నుంచి రూ.6 వరకు పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, లేదంటే ధరల పెంపు తప్పదని వెల్లడించాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించకుంటే వాహనదారులపై కిలో సీఎన్‌జీ గ్యాస్‌పై రూ.4-6 వరకు భారం పడుతుందని స్పష్టం చేస్తున్నాయి. దేశీయ సమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు సరఫరా ప్రతి ఏడాది 5 శాతం మేర పడిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో సిటీ గ్యాస్ రిటైలర్లకు సప్లై పడిపోయి ధరలు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోందని తెలుస్తోంది.