ఏపీలో రైతులకు ముఖ్య గమనిక.. ఆ డబ్బులు మీరే చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమైన గమనిక. రైతులకు 2019 ముందు నాటి పంటల బీమా విధానమే రబీ నుంచి అమలు చేస్తున్నామన్నారు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌. ఈ మేరకు పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రబీ పంటల బీమా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ప్రణాళిక అధికారులు, లీడ్‌బ్యాంకు మేనేజర్లతో వీడియో సమావేశం జరిగింది. పీఎంఎఫ్‌బీవై (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా), సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు రాజశేఖర్ సూచించారు.

గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా రుణాలు తీసుకోని రైతులు ప్రీమియం చెల్లించవచ్చని తెలిపారు రాజశేఖర్. అలాగే రైతులు జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నమోదు చేయాలని.. పంటరుణాలు తీసుకునే సమయంలో రైతుల నుంచి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకుంటాయని చెప్పారు. ఒకవేళ అంగీకారం తెలియజేయకుంటే ఆ మొత్తం మళ్లీ వెనక్కు వస్తుందని క్లారిటీ ఇచ్చారు. నవంబరు 15వ తేదీలోగా జీడిమామిడికి పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు.
టమాటాకు బీమా అమలు చేస్తున్నారని.. నంద్యాల జిల్లాలో సెనగను వాతావరణ ఆధారిత బీమాలో అమలు చేయాలని సూచించారు. అలాగే కొందరు అధికారులు పంటల బీమా నమోదుకు సమయం పొడిగించాలని కోరారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ సమావేశాల్లో రబీ బీమాపై తరచూ సమీక్షించాలన్నారు.

మరోవైపు గిరిజన రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్యం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని మళ్లీ అమలు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన రైతులకు వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పరికరాలు అందించేందుకు.. ప్రత్యేక సాయం కింద కేంద్రం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధుల్ని వారికి అందించనున్నారు. ఈ క్రమంలో ఆర్థికశాఖ ఆ నిధుల్ని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17,206 మంది గిరిజన రైతులకు లబ్ధి జరుగుతోంది. ట్రైకార్‌ ద్వారా త్వరలోనే టెండర్లు పిలిచి పరికరాలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించనుంది ప్రభుత్వం.

గిరిజన రైతులు కోరుకున్న పరికరాలను అందిస్తారు.. 90 శాతం రాయితీతో వీటిని అందజేతారు. కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్యకార రైతులు వారి అవసరాలకు వినియోగించుకునేందుకు 30 రకాల పరికరాలను అధికారులు గుర్తించారు. వాటిలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రోటవేటర్లు, ఆయిల్‌ ఇంజిన్లు, పవర్‌ టిల్లర్, పవర్‌ వీడర్, స్ప్రేయర్లు, ఫిషింగ్‌ బోట్లు, ట్రాలీలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరగనుంది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *