వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ముదురుతున్నాయి. వైఎస్ జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకూ ఇరువురు నేతల మధ్య విమర్శలకు దారితీస్తోంది. ఇదే క్రమంలోనే వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ తన సొంత ఆస్తిలో.. చెల్లెలుకు వాటా ఇవ్వాలనుకున్నారని, కానీ షర్మిల మాత్రం వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా అంతం చేయడమే షర్మిల ఉద్దేశమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“మా ఇంటి రామాయణం బజారుకు ఈడ్చారు షర్మిల. అక్రమ కేసుల కారణంగా వైఎస్ జగన్ ఆస్తులు అన్నీ కూడా.. ఈడీ, సీబీఐ చేతిలో అటాచ్ అయ్యాయి. దీంతో ఆస్తుల బదలాయింపు జరగలేదు. అయితే షర్మిల మీద ప్రేమతో వైఎస్ జగన్ ఇవ్వాల్సిన ఆస్తులపై ఎంవోయూ చేసుకున్నారు. అవి కూడా ఆయన సంపాదించిన ఆస్తులు. వీటిపై షర్మిలకు హక్కేమీ లేదు. అవేమీ వాళ్ల తండ్రి గారు సంపాదించినవీ కాదు. కేసులు పరిష్కారమైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ.. అప్పటి వరకూ ఆస్తుల బదలాయింపు చేయకూడదని ఎంవోయూలో ఉంది. కానీ వైఎస్ షర్మిల మాట్లాడుతుంటే అన్న మీద రాయి వేయడం కాదు.. బాంబు వేయాలనేదే ఆమె ఉద్దేశంలా అనిపిస్తోంది.” అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.