చనిపోతే ఒకే ఒక్క క్షణం.. ఆశయం కోసం పనిచేస్తే అదే శాశ్వతం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చావు గురించి ఆలోచిస్తే ఏదీ చేయలేమని.. ఏదైనా సరే ముందుకెళ్లి ఎదుర్కొందామని అనుకున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న సమయంలో పరిస్థితుల్ని చంద్రబాబు వివరించారు. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు గెస్ట్‌గా వెళ్లారు. గతేడాది తన అరెస్టు, జైల్లో గడిపిన రోజులు, కూటమి ఏర్పాటు వంటి అంశాలపై బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు.
విజయవాడ వరదల సమయంలో ఓ ఘటనను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వరద తీవ్రత, బాధితుల స్థితిగతులు తెలుసుకోవాలంటే.. కచ్చితంగా వాళ్ల దగ్గరకు వెళ్లాలని తాను భావించానన్నారు. అందుకే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా.. బోటు ఎక్కి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. భద్రతా సిబ్బంది బోటులో వెళ్లొద్దని చెప్పినా పట్టించుకోలేదని.. తాను వెళ్లి చూస్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. అక్కడి పరిస్థితులు చూసి ఎంతో ఆవేదన కలిగిందని.. అందుకే కలెక్టరేట్‌లోనే పది రోజులు బస్సులో బస చేశానన్నారు. ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించానని.. ఆ సమయంలో ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు.