సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి తెలిపారు.
మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాలలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీశాఖకు చెందిన భూములు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సర్వే చేయాలని.. ఏవైనా భూములు కలిసి ఉంటే వాటి విస్తీర్ణం ఎంత అనే దానిపై నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలోనే దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే నిర్వహించారు. సర్వే పూర్తైన తర్వాత వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నారు.