ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్‌ తదితర సౌకర్యాలను పునరుద్ధరించనున్నారు.

మరోవైపు తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న వారందరినీ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి తెచ్చారు అధికారులు. అంతేకాదు సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సర్వీస్‌ సంస్థ పరిధిలో ఉద్యోగులుగా నియమించి.. ఈ సంస్థ పరిధిలో హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయనున్నారు. వీరిని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా తీసుకుని.. ఇక నుంచి ప్రతి నెలా జీతం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ మేరకు బకాయిల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ రూ.24 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై.. ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టు విధానంలో ఈఎన్‌సీ ఆధ్వర్యంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 670 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ పనులు విస్తృతంగా చేపడుతుండటంతో.. గతంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం వారిని కాంట్రాక్టు విధానంలో నియమించింది. వీరిని గ్రామాల్లో మెటీరియల్‌ నిధులతో చేపట్టే సిమెంట్‌రోడ్లను పర్యవేక్షించేందుకు నియమించారు. గతంలో రాష్ట్రంలో ప్రతి ఏటా 10 వేల కిలోమీటర్ల మేరకు సిమెంటు రోడ్లు వేస్తుండటంతో ఇంజనీర్లకు పనుల ఒత్తిడి పెరిగింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ మండలస్థాయిలోను, ఈఎన్‌సీ కార్యాలయంలోనూ సుమారు 56 మంది సిబ్బందిని నియమించారు.

వీరికి జీతాల కోసం 3 శాతం నిర్వహణ వ్యయం ఈఎన్‌సీ కార్యాలయానికి ఇచ్చేవారు. గత ప్రభుత్వంలో వీరికి వేతనాలు అందలేదు.. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో కొంతకాలం జీతాలు అందించారు. కానీ ఆ తర్వాత జీతాలు నిలిపివేశారు.. గతేడాదిగా మొత్తంగా వారికి జీతాలు అందలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే జీతాల కోసం ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది.. ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు ఉద్యోగులను తొలగించాలని సూచించారు. కానీ వారిని తొలగించలేదు.. జీతాలు కూడా ఇవ్వలేదు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఉద్యోగులకు ఊరట ఇచ్చారు. వచ్చే నెలలో జీతాల బకాయిలు అందించే పనిలో ఉన్నారు..మిగతా ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమానంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించనున్నారు.

About amaravatinews

Check Also

ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *