Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా కొన్ని రోజులుగా వరుసగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీలు రాణిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లకుపైగా పెరిగింది. దీంతో మదుపరుల సంపద ఏకంగా రూ.6 లక్షల కోట్లు పెరిగింది.
ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 779 పాయింట్లు లాభపడి 80,183 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక నిఫ్టీ 50 సూచీ 218 పాయింట్లు పెరిగి 24,400 పాయింట్ల మార్క్ వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి