ఏపీలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమైంది. అయితే నరిశెట్టి రాజమ్మ అనే వృద్ధురాలు పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రాజమ్మ.. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వరద బాధితులకు రూ.50 వేల చెక్కును అందించారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే.. అందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు రాజమ్మ.
తమ గ్రామంలో ఇళ్లు లేని పేదలున్నారని చెప్పుకొచ్చారు రాజమ్మ. వారికి ప్రభుత్వం తరఫున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన రెండు లేదా మూడు సెంట్ల చొప్పున స్థలాన్ని అందిస్తానని చెప్పారు. రాజమ్మ దాతృత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. త్వరలో గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నామని, త్వరలో అధికారులు సంప్రదిస్తారని చెప్పారు. రాజమ్మ చొరవను అందరూ అభినందిస్తున్నారు.