వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్ బయటకు చెబుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును ఫిర్యాదులో కోరారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమన్నారు. అందుకే మాధవ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు.
ఏదైనా ఒక ఘటన జరిగిన సమయంలో అత్యాచారాలకు గురైన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు వాసిరెడ్డి పద్మ. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ బయటకు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడటం దారుణమన్నారు. మహిళల మీద, అత్యాచార బాధితుల ఒక మాజీ ఎంపీ ఇలా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలన్నారు.