ఇండోనేసియాలో మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలో ఉన్న ఈ అగ్విపర్వతం గురువారం నుంచి రోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని నుంచి లావా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలు కాలిబూడిదవుతున్నాయి. దీని ధాటికి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అగ్నిపర్వతం విస్ఫోటనాలు ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని హెచ్చరించారు.
అగ్నిపర్వతం విస్ఫోటనంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. మిగిలిన వారిని అధికారులు వాహనాల్లో తరలిస్తున్నారు. రాబోయే రోజుల్లో లావా తమ ఇళ్లను సర్వనాశనం చేసేస్తుందని తెలిసి ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. తాము తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతం నామరూపాల్లేకుండా మారిపోనుండటంతో చివరిసారిగా తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆవేదనతో ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు.
ప్రస్తుతం ఇండోనేషియాలో లెవొటోబి లకిలకితో పాటు అనేక ప్రాంతాల్లో వరుసగా అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను డేంజర్ జోన్‌లుగా ప్రకటించామని వెల్లడించారు. ఈ ఏడాది మే నెలలో హల్మహెరా ద్వీపంలో ఇబు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన ఘటనలో 60 మందికి పైగా మరణించారు. అప్పట్లో అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న ఏడు గ్రామాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఇప్పుడు సెగలు కక్కుతోన్న లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం కూడా భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రాణనష్టం మాత్రం తక్కువగా ఉంది.
విస్ఫోటనం ప్రమాదకర స్థాయికి మించడంతో దాని చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలపైకి లావా సెగలు గక్కుతూ దూసుకొస్తోంది. అయితే, ఆ ప్రాంతానికి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను ఖాళీచేయించారు. సోమవారం ఉదయం నుంచి తరలింపు మొదలుకాగా.. 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో వారికి శిబిరాలు ఏర్పాటుచేశారు. కాగా, ఇండోనేషియాలో అగ్ని పర్వత విస్ఫోటనాలు సర్వ సాధారణం. తరుచూ అక్కడ అగ్ని పర్వతాలు బద్దలై లావా సెగలు గక్కుతూ ఊళ్లకు ఊళ్లను ముంచేస్తోంది.