HYD: బాలుడి ప్రాణం తీసిన బడి గేటు.. విరిగిపడటంతో ఒకటో తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు మీద పడటంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం (నవంబర్ 4) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, సరోజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ (6) హయత్‌నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.

సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూల్ ముందు ఉన్న గేట్‌పై ఎక్కి అజయ్ ఆడుకుంటుండగా.. వెల్డింగ్ జాయింట్లు ఊడిపోయి అది విద్యార్థిపై పడింది. ఈ ప్రమాదంలో అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్కూల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే తమ కుమారుడు చనిపోయాడని బాలుడి తండ్రి చందు కన్నీరు మున్నీరుగా విలపించాడు. గేటు పడిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే తమ బాబు బతికేవాడని వాపోయాడు. ‘మా బాబుని ఇంటి నుంచి రోజు ఆటోలో స్కూల్ కి పంపిస్తాం. 4 గంటలకి రావలసిన బాబు ఇంటికి రాలేదు. స్కూల్‌లో 4 గంటలకు ఘటన జరిగితే.. మాకు 5 గంటలకి సమాచారం ఇచ్చారు. బాబుని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళటానికి కనీసం అంబులెన్స్‌ కూడా లేదు. ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మా బాబు చనిపోయాడు.’ అని తండ్రి చందు కన్నీరు పెట్టుకున్నారు.

కాగా, చిన్నారి అజయ్ మృతితో హయత్‌నగర్‌ జడ్పీ హైస్కూల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం స్కూల్‌ వద్ద చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని.. తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

About amaravatinews

Check Also

హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకునే వారికి భారీ శుభవార్త.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు..!

ప్రతి సామాన్యుడికి సొంతిళ్లు అనేది ఓ కల. తాము ఉద్యోగం చేసే ఊర్లో ఓ సొంతిళ్లు ఉండాలని ప్రతిఒక్కరు కలలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *