Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్ దాటింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 700 పాయింట్ల మేర లాభపడింది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,400 మార్క్ దాటి ట్రేడింగ్ అవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారైన క్రమంలో ప్రధానంగా దేశీయ ఐటీ కంపెనీల్లో జోష్ కనిపిస్తోంది. ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతం మేర లాభపడింది.
డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో డాలర్ ఇండెక్స్ బలపడింది. అది ఐటీ స్టాక్స్‌లో జోష్ నింపినట్లు స్టాక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మన దేశ ఐటీ కంపెనీలకు ప్రధానంగా అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుంది. డాలర్ బలపడితే అది కంపెనీలకు ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ కారణంగానే ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ట్రంప్ గెలిస్తే చైనాపై మళ్లీ ట్యాక్సులు పెంచుతారనే భయంతో చైనా మార్కెట్లతో పాటు హాంకాంగ్ మార్కెట్లూ పడిపోతున్నాయి.