కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం (నవంబరు 15) నుంచి మండల మకరు విళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిచేశాయి. తాజాగా, శబరిమల యాత్రికులకు సేవల కోసం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కారు. దీనికి సంబంధించిన ‘స్వామి’ చాట్‌బాట్ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆవిష్కరించారు. ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఈ చాట్‌బాట్ రూపొందించారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో స్వయంగానే ఆ అయ్యప్ప స్వామే వివరాలు అందించినట్లుగా సమగ్ర వివరాలు లభ్యమయ్యేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు.శబరిమల సన్నిధానంలో పూజా సమయాలు, ఇతర విశేషాలే కాకుండా.. యాత్రికుల ప్రయాణాలకు సంబంధించి విమానాలు, రైళ్లు సమాచారం, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను ‘స్వామి’ ద్వారా పొందవచ్చు. శబరిమల నడక మార్గాల్లో భక్తులకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీచేసి, అప్రమత్తం చేయడానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శబరిమల చరిత్రలోనే తొలిసారి మూడు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరువనంతపురం ఐఎండీ డైరెక్టర్ నీతా.కె.గోపాల్ బుధవారం తొలి బులెటిన్‌ను విడుదల చేశారు. గురు, శుక్రవారాల్లో శబరిమలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇదిలా ఉండగా నెలవారీ పూజల కోసం కూడా భక్తులు శబరిమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో మండల, మకరవిళక్కు సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గురువారం నుంచి మండల పూజల సీజన్ ప్రారంభమవుతుందని, భక్తులు భక్తుల సౌకర్యార్థం దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగిస్తున్నామని ఆయన చెప్పారు.
Amaravati News Navyandhra First Digital News Portal