వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. మాస్టర్ ప్లాన్ అమలు.. మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ పట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ పేషీ కాన్ఫరెన్స్ హాలులో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై, మాస్టర్ ప్లాన్ అమలుపై సమగ్రంగా చర్చించారు.

సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. వేములవాడలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి.. సరికొత్త శోభను తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

మరోవైపు.. వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపోను మంజూరు చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. యార్న్ డిపో ఏర్పాటు కోసం రూ.50 కోట్ల నిధులు కూడా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. జౌళిశాఖపై బుధవారం (నవంబర్ 13న) సంబంధింత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని టెస్కో ఎండీ శైలజా రామయ్యర్‌కి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. టెస్కో నుంచి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇచ్చాయని, సంఘాల నుంచి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సరఫరా చేస్తామని అధికారులు వివరించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *