ఓ విధంగా జగన్ మంచి చేశారంటున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రూ. 400 కోట్లు పెట్టీ జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని.. ‘మనం నెగెటివ్’లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్యాలెస్ కట్టడం వలనే జగన్ పతనం ప్రారంభమైందని.. రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైనా.. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో రుషికొండలో భవనంపై ఆసక్తికర చర్చ జరిగింది.
రుషికొండలో భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని..తనపై సుప్రీం కోర్టుకు కూడా అబద్ధం చెప్పారన్నారు రఘురామ. అప్పటి వరకు టూరిజం ప్రాజెక్టు అని చెప్పి.. అనంతరం సీఎం నివాసం అని చెప్పారన్నారు. ‘అధికారుల కమిటీ వెళ్తుంటే వాళ్లకు రుషికొండ నివాసం కనిపించిందట.. వెంటనే వాళ్ళు రుషికొండ సీఎం నివాసానికి పనికొస్తుందని చెప్పారట’అంటూ రఘురామ గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావించారు. రుషికొండపై ఉన్న ఈ కట్టడాన్ని మంచి భవనంగా తీర్చి దిద్దాలన్నారు రఘురామ. దీనిని నియంత కట్టుకున్న విలాస భవనాలు ఇవి అని ప్రజలకు తెలిసేలా వారిని సందర్శనకు అనుమతించాలన్నారు.రుషికొండ భవనంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో విలాస వస్తువులు చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అన్నారు. ఇలా భవనం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో కూడా తెలియడం లేదన్నారు. భవనంలో తలుపుల కోసం రూ.31 లక్షలు, బాత్‌రూమ్‌లో కమోడ్ కోసం రూ.11 లక్షలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ భవనంలో వాడిన ఖరీదైన ఫర్నిచర్ గతంలో తానెక్కడా చూడలేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్‌ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని.. పర్యాటకశాఖ భవనాల ముసుగులో నిర్మాణాలు చేసి అతిపెద్ద ఆర్థిక కుంభకోణం చేశారన్నారు.