ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ రూ.85 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల(నవంబర్)లోనే శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. నవంబర్ 29వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలుస్తుంది.
ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 ఎకరాలు కేటాయించింది. 600 ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. రోజుకు 1100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 300 ఎకరాల్లో ఎలక్ట్రోలైజర్లు, సోలార్ పీవీ, బ్యాటరీ స్టోరేజీల ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కానుంది. మరో 300 ఎకరాలను మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తారు. మూడేళ్లలోపు మొదటి దశ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.