ఏపీ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట.. 14 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.650 కోట్లు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట దక్కింది. గత పదిహేనేళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని న్యాయవివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు హైకోర్టు తీర్పుతో తిరిగి దక్కాయి. ఈ భూముల విలువ ఏకంగా సుమారు రూ.650 కోట్లని చెబుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సింహాచలం ఆలయ అధికారులకు ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి దాతల ద్వారా సంక్రమించగా.. ఏళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. సింహాచలం ఆలయ అధికారులకు ఈ విషయం తెలియడంతో.. 2009లో ఎండోమెంట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ మరుసటి ఏడాది దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ భూ ఆక్రమణదారులు 2010లో హైకోర్టును ఆశ్రయించగా.. 14 ఏళ్ల విచారణ అనంతరం ఈ నెల 5న కోర్టు ఆక్రమణదారులు వేసిన రిట్‌ను కొట్టేసింది. ఈమేరకు దేవాదాయశాఖ విశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ, వీఆర్వో గంప వరహాలు సమక్షంలో సింహాచలం ఆలయ ఈవో త్రినాథరావు, దేవస్థానం భూపరిరక్షణ విభాగం ఎస్‌డీసీ కె.గీతాంజలి ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

హైకోర్టులో దేవస్థానం తరఫున వాదనలు వినిపించిన ప్రత్యేక లీగల్‌సెల్‌ న్యాయవాది ఎన్‌వీఎస్‌ ప్రసాద్‌వర్మను ఈవో త్రినాథరావు అభినందించారు. ఈ 99.20 ఎకరాల భూమి జాతీయరహదారి-16 పక్కనే ఉండటంతో.. ఈ భూమిని కాపాడేందుకు ప్రహరీ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు ఈవ. ఇక్కడ భూముల అమ్మకాలు జోరుగా సాగుతున్నందున ఆలయ భూమి విలువ కూడా పెరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ జీడి, మామిడి, కొబ్బరి, టేకు తోటలు ఉన్నాయని.. వాటి ఫల ఉత్పత్తిని వేలం వేసి దేవస్థానానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సింహాచలం ఆలయ ఈవో త్రినాథరావు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *