హైదరాబాద్ పుప్పాల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు సైతం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ప్లాట్ పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా బిల్డర్ అపార్ట్‌మెంట్ నిర్మించాడు. ఫైర్ ఇంజిన్ పోవడానికి దారిలేక పోవటంతో మంటల్ని అదుపు చేసేందుకు వచ్చిన మూడు ఫైర్ ఇంజిన్లు గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వచ్చినా.. లోనికి పోవడానికి దారిలేక ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. చివరకు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపడితే ఎలా అని ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.