తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి శంకర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. నవంబర్ 3వ తేదీ నుంచి పరారీలో ఉన్న కస్తూరిని.. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ బ్రాహ్మణ సమాజం సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒక్కసారిగా దుమారం రేపింది.
300 ఏళ్ల కిందట తమిళనాడులోని అంతఃపుర మహిళలకు తెలుగు వారు సేవచేయడానికి వచ్చారని.. వాళ్లు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై కస్తూరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని.. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటం వల్లే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి కీలక వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
అయితే.. కస్తూరి చేసి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. తెలుగు, తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా కస్తూరి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు.. కస్తూరి వ్యాఖ్యలపై అభ్యతరం వ్యక్తం చేస్తూ.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కస్తూరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నోటీసులు ఇవ్వడానికి పోయెస్ గార్డెన్లోని ఆమె నివాసానికి వెళ్లగా.. తాళం వేసి ఉండటంతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.
తనపై కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కస్తూరి.. నవంబర్ 11న ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. కోర్టులోనూ కస్తూరికి చుక్కెదురైంది. నవంబర్ 15న విచారణ చేపట్టిన మద్రాసు న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేషాలను రెచ్చగొట్టేవేనని ధర్మానసం తేల్చిచెప్పింది. తెలుగువారిని తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. తెలుగువారు వలస వచ్చిన వారు కాదని.. తమిళనాడు అభివృద్ధిలో కీలక భాగస్వాములని పేర్కొంది. తమిళనాడులో తెలుగువారు, తమిళులను వేరుచేసి చూడలేమని అభిప్రాయపడింది మద్రాసు ధర్మాసనం.