తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. నవంబర్ 23న ఉదయం 10 గంటలకు 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన 2025 ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా 2025 ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
నవంబర్ 25న 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో 2025 ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవంబర్ 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది టీటీడీ.
Amaravati News Navyandhra First Digital News Portal