అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్ (King Charles) దంపతులు అప్పుడప్పుడు సేదదీరే విశ్రాంతి మందిరం విండ్సర్ క్యాజిల్ (Windsor Castle)లోకి చోరులు ప్రవేశించారు. ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ట్రక్కు, బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రాజ కుటుంబానికి చెందిన ఎవరూ అక్కడ లేనప్పటికీ.. ఈ ఘటన ఎస్టేట్ భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
గత నెల 13 తేదీన ఆదివారం అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు ఆగంతకులు ఆరు అడుగుల ఎత్తున్న ఫెన్సింగ్ ఎక్కి విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్‌లోకి దూకినట్లు యూకే మీడియా కథనాలు పేర్కొన్నాయి. రాజభవనం సెక్యూరిటీ జోన్‌లో ఉండే ఓ ఫామ్ వద్దకు వెళ్లిన ఇద్దరూ.. అక్కడ ఉన్న పిక్‌అప్ ట్రక్కు, క్వాడ్ బైక్‌ను దొంగిలించారు. అదే ట్రక్కుతో వేగంగా ఎస్టేట్ సెక్యూరిటీ గేటును ఢీకొట్టి అక్కడి నుంచి పారారైనట్టు సదరు కథనాలు తెలిపాయి.
సాధారణంగా ఎస్టేట్‌లో అనుమానాస్పదంగా ఏం జరిగినా సెక్యూరిటీ అలారమ్ అలర్ట్ చేస్తుంది. కానీ, దుండగులు లోనికి ప్రవేశించి, చోరీ చేసి పారిపోయే వరకు ఎలాంటి అలర్ట్ రాకపోవడం గమనార్హం. ఈ ఎస్టేట్‌లో నిరంతర పెట్రోలింగ్ ఉంటుందని, అయితే ఆగంతకులు కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తారో కూడా వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై యూకే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవర్నీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal