ఎలాన్ మస్క్ రాకెట్‌ ద్వారా నింగిలోకి ఇస్రో ఉపగ్రహం జీ శాట్-20.. ప్రత్యేకతలివే

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX)కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన 34 నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటక హసన్‌లో ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది. ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ రాధాకృష్ణణ్ దురయ్‌రాజ్ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన.. జీశాట్-20 కచ్చితమైన కక్ష్యలోకి చేరింది అని వెల్లడించారు.ఫాల్కన్ 9 రాకెట్‌కు ఇది 396 ప్రయాణం కాగా.. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా మోసుకెళ్లింది. ఇస్రో వద్ద ప్రస్తుతం రాకెట్‌లు ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ సహకారం తీసుకున్నారు. కెప్ కెనవెరాల్‌లోని స్పేస్ కాంప్లెక్స్‌లో 2019లో ప్రత్యేకంగా అమెరికా సాయుధ దళాల కోసం ఏర్పాటుచేసిన ల్యాంచ్ ప్యాడ్‌ను స్పేస్‌ ఎక్స్ అద్దెకు తీసుకుని, ఈ ప్రయోగం చేపట్టింది.

బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ.. ‘జీశాట్ ఎన్-2 లేదా జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది.. భూకేంద్రంలోని మౌలికసౌకర్యాలు శాటిలైట్‌‌తో అనుసంధానం కానుంది’ అని అన్నారు. ‘కచ్చితమైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహంలో ఎటువంటి సమస్యలు లేవు.. సోలార్ ప్యానెల్లు అమర్చాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే మొదటి ప్రయోగం కావడం విశేషం.

మరోవైపు, ఆధునిక కా బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే మొదటిసారి. దీని రేడియో ఫ్రీక్వేన్సీ శ్రేణి 27 నుంచి 40 గిగాహెర్ట్జ్ (GHz) మధ్య ఉంటుంది. ఇది ఉపగ్రహం అధిక బ్యాండ్‌విడ్త్‌ను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి.

About amaravatinews

Check Also

Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం

ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *