సత్కర్మభీశ్చ సత్ఫలితం.. దుష్కర్మ ఏవ దుష్ఫలం.. అత్యుత్కట పుణ్యపాపానాం సత్యంబలానుభవమిహం.. పురాణాల్లో ఉన్న శ్లోకమిది. మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వల్ల చెడు ఫలితమూ వస్తాయని.. ఏదైనా మనం చేసిన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనని చెప్పేదే కర్మ సిద్ధాంతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ కథనం, ఫోటోలు, వీడియోలు చూస్తే.. కర్మ సిద్ధాంతం నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడనే కారణంతో ఓ కుర్రాడిపై ముగ్గురు యువకులు కలిసి దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కుర్రాడిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన ముగ్గురు యువకులు.. ఆ కుర్రాడు ఎంత వేడుకుంటున్నా వినకుండా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయికి మెసేజ్ చేశాడనే కారణంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఆ అమ్మాయి మెసేజ్ చేయటంతోనే రిప్లై ఇచ్చానని అతను చెప్తున్నా వినకుండా పదే పదే దాడి చేశారు. బూతులు తిడుతూ, కొబ్బరి మట్టతో అతనిపై దాడికి దిగారు. బట్టలు విప్పించి.. మెడకు బిగించి కాళ్లతో తంతూ ఆ యువకుడిపై దాడి చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక యువకుల చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు.. కోనసీమ జిల్లా మలికిపురంలోని ఓ జూనియర్ కాలేజ్‌లో చదువుతున్నట్లు తెలిసింది. నవంబర్ నెల ఐదో తేదీన జరిగినట్లుగా చెప్తున్న ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం.