ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుండగా.. పీఏసీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పెద్దిరెడ్డి వెంట పలువరు ఎమ్మెల్సీలు కూడా తరలి వచ్చారు. పీఏసీ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీలో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ కోసం వస్తే 2 గంటల పాటూ ఎదురుచూసేలా చేశారని మండిపడ్డారు. ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారు అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు. అటువైపుగా రాగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని అచ్చెన్నకు చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత నామినేషన్ స్వీకరించారు.
ఈ పీఏసీ ఛైర్మన్ పదవిపై మంత్రి పయ్యావుల కేశవ్ చిట్ చాట్‌గా మాట్లాడారు. పీఏసీ ఛైర్మన్ పదవి అనేది సభ్యులు ఎన్నుకునే ప్రక్రియ అన్నారు. దీనికి నిబంధనలు, సంస్కరణలు ఉంటాయని.. దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతుంటేనే ఎవరైనా పీఏసీ కమిటీ సభ్యుడిగా ఎన్నికవుతారన్నారు. కమిటీకి ఎన్నికైన వారి నుంచి స్పీకర్ ఛైర్మన్‌గా నామినేట్ చేస్తారన్నారు.