ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇవాళ వైఎస్సార్‌సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీహాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో.. అసెంబ్లీ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ఉంటుంది.
అసెంబ్లీ నుంచి పీఏసీలో 9 మంది సభ్యులు ఉంటారు.. కూటమి పార్టీలు తొమ్మిది మందితో నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది.. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ పీఏసీ పోలింగ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభలో ఎన్ని కమిటీలు ఉన్నా.. పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్‌కు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం ఉండాలని.. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు.