ఆశకి అవసరానికి మధ్య కొట్టిమిట్టాడే మధ్య తరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏవిధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూని సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని.. ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్లకి కట్టే ప్రయత్నం చేశారు. ఏదో బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్‌లో కాకుండా.. ఎంటర్‌టైన్మెంట్ మోడ్‌లోని కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది.. బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా? లేదంటే బొమ్మ ‘బోర్’కొచ్చిందో సమీక్షలో చూద్దాం.
అల్లరి చిల్లరిగా తిరిగే రాకీ (విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేస్తాడు. చదువుపై ధ్యాసలేదని గమనించిన రాకీ తండ్రి రామకృష్ణ (నరేష్).. తన స్వశక్తితో డెవలప్ చేసి కార్ గ్యారేజ్‌లోనే రాకీని మెకానిక్‌గా పెడతాడు. కేవలం మెకానిక్‌గానే కాకుండా.. డ్రైవింగ్ స్కూల్‌ని నడిపిస్తుంటాడు రాకీ. అలా తన దగ్గరకు డ్రైవింగ్ కోసం ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్ధా దాస్)లు వస్తారు. కాలేజ్ డేస్‌లో రాకీ, ప్రియ ప్రేమించుకుంటారు. తన స్నేహితుడు శేఖర్ (విశ్వదేవ్ రాచకొండ) చెల్లెలైన ప్రియని అనూహ్య పరిణామాలతో దూరం చేసుకుంటాడు రాకీ. మళ్లీ డ్రైవింగ్ స్కూల్‌లో ప్రియను కలుసుకున్న రాకీ.. ఆమె అన్న శేఖర్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుంటాడు. శేఖర్ చావుతో కథలో మలుపు ఏంటి? అసలు శేఖర్ ఎందుకు చనిపోయాడు? దానికి కారణం ఎవ్వరు? వాళ్లని రాకీ ఎలా వలవేసి పట్టుకున్నాడు? ఈ కథలో మాయ.. అప్సరగా ఎలా మారింది అన్నదే మెకానిక్ రాకీ అసలు కథ.