శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. శ్రీశైలంలో పర్వదినాలు, వారాంతపు సెలవు రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం నరసింహారెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం అన్నప్రసాద వితరణ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. తనిఖీల సమయంలో అందుబాటులో లేకపోవడంతో పాటు అన్న ప్రసాదంలో జరిగిన అరకొర పదార్థాలు వచ్చిన భక్తులకు వడ్డించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈవో పరిశీలనలో అన్న ప్రసాద నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడంతో సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిని సస్పెన్షన్ చేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ అజాద్ తెలిపారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు సేవలందించేందుకు ఉండే ఆలయ అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో చంద్రశేఖర్ ఆజాద్. అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈవో శ్రీశైలంలో తనిఖీలు చేశారు.. భక్తులకు అందించే వైద్యసేవలను తెలుసుకుని దేవస్థానం ఆసుపత్రిని తనిఖీ చేసి మందుల పంపిణీ విధానంపై ఆరా తీశారు. అత్యవసర వైద్యసేవలతో పాటుగా ఆధునిక వైద్యపరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈవో ఆజాద్. అలాగే టిక్కెట్ కౌంటర్స్, ఆర్జిత సేవా టిక్కెట్లు, లడ్డూ తయారీ, అన్నదానం, విక్రయాలు, డొనేషన్లు, అకామిడేషన్, పెట్రోల్ బంక్స్, టీవీ ఛానల్ నిర్వహణలో లొపాలు లేకుండా చిత్తశుద్దితో విధులు నిర్వహించాలని పలు సూచనలు చేశారు. శ్రీశైలం ఆలయ అధికారులు, ఉద్యోగులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు.