సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించాడు. మంగళవారం ఉదయం పూట కిమ్స్ హాస్పిటల్‌కు బన్నీ వెళ్లాడు. బన్నీతో పాటుగా దిల్ రాజు కూడా హాస్పిటల్‌కు వెళ్లాడు. శ్రీతేజ్‌తో పాటుగా రేవతి భర్తను కూడా బన్నీ పరామర్శించాడు. ఈ మేరకు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి, పర్మిషన్ తీసుకుని బన్నీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. గత నెలలో సంధ్య థియేటర్ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్‌కు బన్నీ వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరికీ తెలిసిందే. శ్రీతేజ్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడం, చాలా రోజులు కోమాలోనే ఉండటం అందరికీ విదితమే. ఈ మధ్యే శ్రీతేజ్ కాస్త కోలుకుంటున్నాడు. ఇవన్నీ జరిగే లోపు బన్నీని అరెస్ట్ చేయడం, జైలుకి పంపండం.. అదే రోజు బెయిల్ రావడం.. రాత్రంతా జైల్లోనే ఉంచడం.. తెల్లారి రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే.
సంధ్య థియేటర్ ఘటన కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీలో సైతం ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. బన్నీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా వ్యవహారం నడిచింది. పోలీసులు యంత్రాంగం చెప్పిన వాటిని, ప్రభుత్వం చెప్పిన వాటిని చూస్తే తన వ్యక్తిత్వాన్ని కించపర్చుతున్నట్టుగా ఉందని బన్నీ పెట్టిన మీడియా ప్రెస్ మీట్ కూడా వైరల్ అయింది.