సోషల్ మీడియా మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!

హైదరాబాద్ మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా నగరంలో మరో దందా బట్టబయలు అయ్యింది. పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను, వేపింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నాంపల్లి ప్రాంతానికి చెందిన సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు అన్నదమ్ములు ‘SID’ పేరుతో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 500 మందికి పైగా సభ్యులను ఈ గ్రూప్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాకు పోలీసులు ఫైనల్ గా చెక్ పెట్టారు.

ఈ ముఠా గురించి సమాచారం అందడంతో.. నెట్‌వర్క్ పరిధి తెలుసుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు. కొత్త స్టాక్ వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో అప్డేట్ ఇస్తున్నట్లు గుర్తించారు. తెలివిగా కొనుగోలుదారులు నుంచి నేరుగా నగదు తీసుకోకుండా.. తమ కుటుంబ సభ్యులకు యూపీఐ, పేటీఎం, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా డబ్బులు పంపమనేవారు. పక్కా ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం నిందితులకు ఈ సిగరెట్స్, వేప్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కోసం హవాలా మార్గాలను కూడా ఉపయోగించారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ర్యాపిడో, ఉబర్ వంటి సర్వీసులతో పాటు డీటీడీసీ కొరియర్ ద్వారా కూడా ఈ-సిగరెట్లను నిందితులు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

కాగా నిందితుల వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువైన ఈ సిగరెట్స్, 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద కొనుగోలుదారులుగా ఉన్నవారిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు నిఘా పెట్టారు.

అధికారుల సూచన

విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రజలందరూ ఈ-సిగరెట్లు, వేప్‌లు వంటి నిషేధిత వస్తువుల వాడకం గురించి సమాచారం ఇవ్వాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(TGANB) అధికారులు కోరారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు లేదా tsnabho-hyd@tspolice.gov.in ఇమెయిల్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ-సిగరెట్లు ఎందుకు నిషేధం?

ఈ-సిగరెట్లు, వేప్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా యువత, పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా వీటిని భారత్‌లో నిషేధించారు. అయినప్పటికీ, అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని TGANB అధికారులు తెలిపారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *