విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై ఆలయ పరిసరాల్లోనే కాకుండా, బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లలోనూ భక్తులకు అమ్మవారి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచే విధంగా దేవస్థాన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా భక్తుల విజ్ఞప్తి మేరకు విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డిలలో దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్-1 సమీపంలో ఓ దేవస్థానం కౌంటర్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కౌంటర్లలో శ్రీ కనకదుర్గమ్మ వారి ఆర్జిత సేవల బుకింగ్, విరాళాలు చెల్లింపులు, దర్శన టికెట్ల విక్రయం, లడ్డూ ప్రసాదాల విక్రయం వంటి సౌకర్యాలని కల్పిస్తున్నట్టు వారు తెలిపారు. దుర్గమ్మ సేవలు అందరికి అందుబాటులోకి తేవడమే ప్రధానంగా లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే సామర్ధ్యం ఉన్న దేవస్థాన సిబ్బందికే ఈ కౌంటర్లో విధులు కేటాయిస్తున్నారు.
అయితే గతంలో అమ్మవారి దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా.., లడ్డు ప్రసాదాలు తీసుకోవాలన్నా కచ్చితంగా ఆలయానికి వెళ్లాల్సి ఉండేది, కొండపైన కానీ కొండ దిగువన గాని ఇవి అందుబాటులో ఉండేవి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శన టికెట్లు దొరకడం కష్టంగా మారేది. ఇక ఈ సమస్యపై దృష్టి సారించిన ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు తొలగించేందుకు అమ్మవారి ఆలయ చుట్టుపక్కల్లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే టికెట్ బుకింగ్స్, రిజర్వేషన్స్‌తో పాటు లడ్డు ప్రసాదాల విక్రయాలు కూడా చేస్తున్నారు. దీంతో అత్యవసర పనుల నిమిత్తం దర్శనం చేసుకోలేక పోయే భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన దేవస్థాన కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు.